Ezekiel 12

1యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు. 2<<నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కన్నులు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.

3నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.

4వాళ్ళు చూస్తుండగానే పగటి వేళ దేశాంతరం వెళ్ళడానికి నీ సామాను బయటకి తీయాలి. అలాగే మరో దేశం ప్రయాణమయ్యే వాడు వెళ్ళినట్టుగా వాళ్ళు చూస్తుండగా సాయంత్రం వేళలో వెళ్ళాలి. 5వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు. 6వాళ్ళు చూస్తుండగా నీ వస్తువులను భుజం మీదికెత్తుకో. వాటిని రాత్రివేళ బయటకు తీసుకు రా. నీకు నేల కనపడకుండా ముఖం కప్పుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించాను.>>

7ఆయన నాకాజ్ఞాపించినట్టే నేను చేశాను. దేశాంతరం వెళ్ళడానికి పగలు సామాను బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేత్తో గోడకి కన్నం వేసి నా వస్తువులను చీకట్లో బయటకు తెచ్చాను. వాళ్ళు చూస్తుండగా వాటిని నా భుజం పైకెత్తుకున్నాను. నేను దేశాంతరం పోతున్నట్టుగా పగటివేళ నా సామాను బయటికి తెచ్చి పొద్దుగుంకే వేళ నా చేత్తో గోడకు కన్నం వేసి, వారు చూస్తుండగా సామగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకున్నాను.

8తరువాత ఉదయం యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. 9<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తిరగబడే జనం <నువ్విలా చేస్తున్నావేమిటి?> అని అడగడం లేదా? 10వాళ్ళకిలా చెప్పు. ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం యెరూషలేములోని పరిపాలకుడికీ దానిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెందుతుంది.

11నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు. 12వాళ్ళలో ఉన్న పరిపాలకుడు తన సామాను భుజం మీద ఎత్తుకుని రాత్రివేళ గోడలో నుండి వెళ్తాడు. వాళ్ళు గోడ తవ్వి దాంట్లో నుండి తమ వస్తువులు బయటకు తీసుకువస్తారు. అతడు నేలను చూడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు. 13నేను అతణ్ణి పట్టుకోడానికి వల విసురుతాను. అతడు నా వలలో చిక్కుకుంటాడు. అతణ్ణి కల్దీయ ప్రజల దేశమైన బబులోనుకి తీసుకు వస్తాను. కానీ అతడు ఆ స్థలాన్ని చూడకుండానే మరణిస్తాడు.

14అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారినీ, అతని మొత్తం సైన్యాన్నీ నేను అన్ని దిక్కులకీ చెదరగొడతాను. వాళ్ళ వెనుకే ఒక కత్తిని పంపి తరుముతాను. 15నేను వాళ్ళని అనేక జనాల్లోకి చెదరగొట్టి, అనేక దేశాల్లోకి పంపిన తరువాత వాళ్ళు నేనే యెహోవాాను అని తెలుసుకుంటారు. 16ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.>>

17యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 18<<నరపుత్రుడా, భయపడుతూ నీ ఆహారం తిను. చింతా ఆందోళనలతో నీళ్ళు తాగు.

19తరువాత, దేశ ప్రజలకు ఇలా ప్రకటించు. యెరూషలేములో నివసించే వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు దేశాన్ని గూర్చీ ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. వాళ్ళు వణికిపోతూ తమ ఆహారం తింటారు. భయపడి పోతూ నీళ్ళు తాగుతారు. ఎందుకంటే అక్కడ నివసించే వాళ్ళు చేసే హింస, దౌర్జన్యాల వల్ల దేశంలోని సౌభాగ్యం నాశనం అయింది. 20పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాాను అని తెలుసుకుంటారు.>>

21తిరిగి యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. 22<<నరపుత్రుడా, <రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది> అని సామెత చెప్తారే. దాని అర్ధం ఏమిటి? 23కాబట్టి నువ్వు వాళ్లకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవాా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత చెప్పకుండా నేను ఈ సామెతకి ముగింపు పలుకుతున్నాను. దాన్ని వ్యర్ధం చేస్తున్నాను. ఇలా చెప్పి వాళ్ళకి <ప్రతి దర్శనమూ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి.> అని ప్రకటించు.>>

24<<ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ, అనుకూల జోస్యాలూ ఉండవు. 25నేను యెహోవాాను. నేనే మాట్లాడుతున్నాను. నా మాటలు నేను నెరవేరుస్తాను. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇదంతా జరుగుతుంది. తిరగబడే జనమా, మీ రోజుల్లోనే నేను ఈ మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువైన యెహోవాా చేస్తున్న ప్రకటన.>>

26తిరిగి యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. 27<<నరపుత్రుడా, చూడు. <ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు> అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవాా చేస్తున్న ప్రకటన.>>

28

Copyright information for TelULB